ప్రియురాలిని తుపాకితో గాయపరిచి పారిపోయిన ఎస్ఐ సందీప్ దహియా ఇవాళ (సోమవారం) ఉదయం తన మామను(భార్య తండ్రి) చంపినట్లు పోలీసులు తెలిపారు. అధికారంలో ఉన్న ఎస్ఐ దహియా.. ఇద్దరు వ్యక్తులను కాల్చడానికి ఉపయోగించిన సర్వీస్ రివాల్వర్‌తో సహా పారిపోయాడని, ప్రస్తుతం ఆయన కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వివరాలు.. ఎస్ఐ సందీప్ దహియా(36) వివాహితుడు. అయితే కొంతకాలం తన భార్యతో విడిగా ఉంటున్న క్రమంలో ఆయనకు మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ప్రియురాలితో గొడవ పడిన అనంతరం ఆమెను తుపాకితో కాల్చి గాయపరిచాడు. అనంతరం తన భార్యను చంపేందుకు ఆమె పుట్టింటికి వెళ్లాడు.
అక్కడ అతని భార్య లేకపోవడంతో ఆమె తండ్రి రణ్వీర్ సింగ్‌ను విచక్షణ రహితంగా కాల్చి చంపాడు.అయితే దహియా తన ప్రియురాలితో లాహోరీ గేటు పోలీసు స్టేషన్ పరిధిలో కారులో గొడవ పడుతున్న క్రమంలో ఆమెను తుపాకితో కాల్చి పారిపోయాడని, అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్ఐ జైవీర్ ఆమెను రక్షించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ గౌరవ్ శర్మ తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో దహియా తనను తుపాకితో కాల్చినట్లు సదరు మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సదరు పోలీసుల అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.