ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… కృష్ణా జిల్లా, పునాదిపాడు మండలం, కంకిపాడు గ్రామానికి చెందిన రావూరి దుర్గప్రసాద్ మియాపూర్‌లోని ప్రజయ్ సిటీలోని బ్లాక్ నంబర్.5లో ఉంటూ అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య శ్రావణి, మూడేళ్ల పాప ఉన్నారు.
ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు బైక్‌పై ఇంటికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ నంబర్.631 వద్ద డివైడర్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.