టీటీడీ  బోర్డుని రద్దు చేయాలన్న డిమాండ్

టీటీడీ  బోర్డుని రద్దు చేయాలన్న డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్థానం షార్ట్ కట్ లో టీటీడీ అంటే అందరికీ తెలుస్తుంది. అలాంటి టీటీడీ బోర్డులో ఈసారి జంబో జట్టు చేరిపోయింది. ఏకంగా 35 మంది వరకూ చోటు కల్పించారు. బీజేపీకి చెందిన ఒక నాయకుడు చెప్పినట్లుగా వీరంతా కుటుంబాలతో సహా తిరుమలకు వస్తే అక్కడ మండపాలు ఏ ఒక్కటీ  సరిపోవేమో.
నిజానికి ఈ జంబోజెట్ బోర్డ్ అవసరమా. క్లుప్తంగా స్వామి వారి సేవకు అంకితం అయిన వారిని కొందరిని ఎంపిక చేస్తే బాగుండేది అన్న మాట అంతటా వినిపిస్తోంది. ఇక ఈ బోర్డ్ లో మరో పెద్ద లోపాన్ని గుర్తిస్తున్నారు. ఏపీలో తిరుపతి ఉంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో ఉంది. కానీ ఏపీకి తక్కువ ప్రాతినిధ్యం బోర్డులో ఉంటే రాయలసీమను పూర్తి అన్యాయం జరిగిందన్న మాట గట్టిగా వినిపిస్తోంది.
దాంతో ఇపుడు బోర్డ్ కూర్పుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అంతే కాదు, నాడు లోకేష్ బినామీ అంటూ శేఖర్ రెడ్డి మీద నిందలు వేసింది వైసీపీ నేతలే. ఇపుడు అదే శేఖర్ రెడ్డి ని బోర్డు మెంబర్ గా ఎలా నియమితులయ్యారన్నది కూడా అర్ధం కాని విషయం. దీంతో  వైసీపీ నేతలు అప్పట్లో టీడీపీ మీద చేసిన అవినీతి ఆరోపణలు గాలి మాటలేనా అన్న భావన కలిగేట్టుగా ఉందని అంటున్నారు..
ఇవన్నీ ఇలా ఉంచితే టీటీడీ  బోర్డుని రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వూపందుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి గట్టిగానే విమర్శలు గుప్పించారు. ఈ బోర్డును రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరి జగన్ సర్కార్ ఆచీ తూచీ ఏర్పాటు చేసిందనుకుంటున్న టీటీడీ బోర్డ్ వివాదమయం కావడం బాధాకరమే. చూడాలి ఏం జరుగుతుందో.