నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థకు చెందిన జంట టవర్లను మే 22 నాటికి పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు నోయిడా అథారిటీ నేడు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని నోయిడా అథారిటీ తెలిపింది. ఆగస్టు 22 నాటికి శిధిలాలను కూడా తొలగిస్తారని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్’లతో కూడిన ధర్మాసనంకు అథారిటీ తెలియజేసింది. భాగస్వాములందరితో సమావేశం ఫిబ్రవరి 9న జరిగిందని కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో తదుపరి విచారణ మే 17న జరగనుంది. కూల్చివేతకు గెయిల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అందిందని అథారిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. నోయిడాలోని సెక్టార్ 93లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయాలనే తన ఆదేశాలను పాటించనందుకు డైరెక్టర్లను జైలుకు పంపాలని హెచ్చరించింది. యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట టవర్లను కూల్చివేయాలని ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది.
అయితే ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది.