Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఆచూకీ లభ్యమైనట్టు తెలుస్తోంది. డేరాబాబా దోషిగా నిర్ధారణ అయిన తర్వాత చెలరేగిన విధ్వంసం కేసులో నిందితురాలిగా ఉన్న హనీప్రీత్ కోసం హర్యానా, పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసును విచారిస్తున్న సిట్ పోలీసులు రాజస్థాన్ లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపడంతో హనీప్రీత్ గుట్టువీడింది. విధ్వంసం తరువాత హఠాత్తుగా కనిపించకుండా పోయిన హనీప్రీత్ అప్పటినుంచి నేపాల్ లో తలదాచుకుంటున్నట్టు నిర్ధారణ అయింది. సిట్ పోలీసులు నేపాల్ లో తమ సోర్స్ ద్వారా హనీప్రీత్ ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని కనుగొన్నారు. సెప్టెంబరు 2న హనీప్రీత్ నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో కనిపించిందని తొలుత పోలీసులకు సమాచారం అందింది.
ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు హనీప్రీత్ తన గెటప్ ను పూర్తిగా మార్చేసుకోవడంతో పాటు గతంలోలా లగ్జరీ కార్లలో తిరగకుండా..సాధారణ, ప్రయివేట్ టాక్సీలో ప్రయాణం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలోనే లోతుగా దర్యాప్తు చేస్తే….హనీప్రీత్ నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో తలదాచుకుంటున్నట్టు కచ్చితమైన సమాచారం లభించింది. ఆమెతో పాటు డేరా బాబా ప్రధాన అనుచరుడు ఆదిత్య కూడా ఉన్నాడు. వారిద్దరినీ త్వరలోనే భారత్ తీసుకురానున్నారు. నేపాల్ భూకంపం సమయంలో సహాయక చర్యలు చేపట్టిన గుర్మీత్ కు ఆ దేశంలో కూడా భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ బాబాకు ఓ ఆశ్రమం కూడా ఉంది.