Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గురించి, ఆయన ఆశ్రమంలోని అకృత్యాల గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా డేరా బాబా ఆశ్రమంలో అత్యాచారాలే కాదు…హత్యలూ నిత్యకృత్యమే అన్నవాదనకు విస్తుపోయే రీతిలో ఆధారాలు లభించాయి. సిర్సాలో పోలీసుల తనిఖీలు చేపడుతున్నారనగానే..బాబా ఆశ్రమంలో అస్థిపంజరాలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. డేరా అనుకూల పత్రిక సచ్ కహూ ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాదు ప్రతి అంశాన్ని బాబాకు అనుకూలంగా మలిచి వార్త రాసే ఆ పత్రిక .. భక్తుల కోరిక మేరకు వారు చనిపోయిన తరువాత..మోక్షం కోసం వారి మృతదేహాలను ఆశ్రమంలో పాతిపెట్టేవారని …అందుకే ఆశ్రమంలో అస్థిపంజరాలు ఉంటాయని రాసుకొచ్చింది. అయితే ్ డేరా బాబాకు ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేసి ఆశ్రమంలోని ఆవరణలో పూడ్చిపెట్టేసే వారని గతంలో అక్కడ పనిచేసిన ఎందరో సిబ్బంది చెప్పారు. ఇలా డేరా బాబా ఆశ్రమంలో హత్యకు గురయింది ఒకరో ఇద్దరో లేకపోతే పది మందో కాదు. 600 మందికి పైనే. డేరా సచ్చా సౌదా లో వెలుగుచూసిన అస్థిపంజరాలే ఇందుకు నిదర్శనం.
హర్యానా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆశ్రమం అంతటా చేసిన తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో 600కు పైగా అస్థిపంజరాలు వెలుగుచూశాయి. వీటిలో కొన్ని అస్థిపంజరాలను జాతీయ మీడియా సమక్షంలోనే వెలికితీశారు. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆశ్రమంలో అస్థిపంజరాలు ఉన్న విషయం అక్కడ సంచరించేవారిలో చాలా మందికి తెలుసు. ఎలాగంటే..మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రతిచోటా డేరా బాబా ఓ మొక్క నాటించాడు. ఆ మొక్కలు కొన్ని మహావృక్షాలయ్యాయి. ఆశ్రమంలో పచ్చగా కనిపించే చెట్ల కింద ఎంతో రక్తం పారిందన్న విషయం ఇప్పుడు బయటిప్రపంచానికి తెలిసింది. ఈ అస్థిపంజరాలు ఎవరివన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక ప్రాంతాల నుంచి డేరాకు వెళ్లి కనిపించకుండా పోయిన వారి వివరాలు ఆరా తీస్తున్నామని, ప్రతి అస్థిపంజరం డీఎన్ ఏ నమూనాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.