దేవదాస్ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

devadas Movie Review

నటీ నటులు : నాగార్జున , నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక
సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుదీన్
సంగీతం : మణి శర్మ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : టి.శ్రీరాం ఆదిత్య

davadas nagarjuna movie

తెలుగు సినిమాలో మల్టీస్టారర్ల ట్రెండ్ ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ మల్టీస్టారర్ చిత్రాలు ఇండస్ట్రీని ఏలాయి. ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు కోకొల్లలుగా వచ్చినా ఫ్యాన్ బేస్ లు పెరిగి ఫ్యాన్స్ మధ్య అంతరాలు పెరిగి అవి దాదాపుగా తగ్గిపోయాయి. దీంతో ఇకపై మల్టీస్టారర్లు తెలుగు తెరపై కనుమరుగైపోతాయని అనుకున్నారంతా. కానీ ప్రస్తుతం యువ హీరోలు మల్టీస్టారర్లపై ఆసక్తి చూపుతున్నారు. కథ నచ్చితే మరో స్టార్ హీరోతో కలిసి నటించడానికి వెనుకాడటంలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మొదలు ఈ ఐదేళ్లలో చిన్నా పెద్దా చాలా మల్టీస్టారర్లే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘దేవదాస్’ వచ్చింది. మాఫియా డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని నటించారు. నటించిన ఈ సినిమా ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ వంటి వైవిద్యభరిత చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్సకత్వం నుండి రావడంతో సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులని ఈ సినిమా ఎంతవరకు అలరించింది అనేది సమీక్షలో చూద్దాం.

స్టోరీ లైన్ : 

davadas nagarjuna nani
దాస్(నాని) ఒక సాధారణ మధ్య తరగతి నుండి మెడిసిన్ పట్టా పొందిన వ్యక్తి. చిన్న చిన్న తప్పులు చేసి పెద్ద హాస్పిటల్ లో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకుని ఒక క్లినిక్ మొదలుపెడతాడు. అయితే పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన దేవా(నాగార్జున) అనే అండర్ వరల్డ్ డాన్ కి ముందు తెలియక తర్వాత తెలిసాక వైద్య వృత్తికి ద్రోహం చేయలేక అతనికి రహస్యంగా తన క్లినిక్ లో వైద్యం చేస్తూ ఉంటాడు. అయితే దాస్ మంచితనం దేవాని కట్టిపడేయడంతో దేవా, దాస్ ని తరుచూ కలవడానికి వస్తూ ఉంటాడు. వారి పరిచయం మంచి స్నేహానికి దారి తీస్తుంది. ఇలా సాగుతున్న సమయంలో దాస్ కళ్ళ ముందే దేవా అర్జున్ (నవీన్ చంద్ర)ని చంపెయ్యడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అసలు ఈ దేవా ఎవరు? అతను అండర్ వరల్డ్ డాన్ ఎందుకయ్యాడు ? అర్జున్ ఎవరు ? దేవా ఎందుకు చంపాడు ? అంతే కాక దేవాకి, దాస్ కి ఇద్దరు కథానాయికలకు ఉన్న సంబంధం ఏమిటి ? అన్న సంగతి తెలుసుకోవాలి అంటే థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

davadas-movie
మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక ఫన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. నిజానికి ఇంతకు ముందు తెలుగులో చాలా మాఫియా, గ్యాంగ్ స్టర్ బేస్డ్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ అదే లైన్ తీసుకుని సినిమాని అందంగా మలిచిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. ఒక అండర్ వరల్డ్ డాన్ మామూలు మనిషి కావడానికి జరిగిన సంఘర్షణను శ్రీ రాం ఆదిత్య తెరకెక్కించిన తీరు బాగుంది. ఎక్కడా అతి చేయకుండా అనవసరపు భేషజాలకు పోకుండా సినిమా తెరకెక్కించారు. ఇక పాత్రధారుల నటన విషయానికి వచ్చినట్టయితే, కింగ్ నాగార్జున తనలోని రొమాంటిక్ షేడ్ ని మళ్ళీ చూపించారు. నాగ్ పాత్ర మొదటి నుంచి జల్సా రాయుడిలానే నడుస్తుంది. నాని అమాయక డాక్టర్ గా సరిగ్గా నప్పాడు . ఎప్పటిలాగే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తోనూ తన సహజ నటనతోను ఈ చిత్రానికి మరింత పరిపూర్ణత అందించాడు. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున నానీల మధ్య వచ్చే అన్ని సీన్లు సినిమాకు చాలా ప్లస్.
davadas nani nagarjuna
రష్మికా మందన్న మరియు అకాంక్ష సింగ్ లు తెరపై అందంగా కనిపించారు. పెద్దగా నటనకు ఆస్కారం లేని పాత్రలు కాబట్టి, ఉన్న కొద్ది సేపు నటనను కూడా చేడకొట్టడానికి ప్రయత్నించారు. ఇక నవీన్ చంద్ర కనిపించింది కాసేపీ అయినా తన నటన బాగుంది. వెన్నల కిషోర్, సత్య, రావు రమేష్ లాంటి వారు ఉన్నా వారిని దర్శకుడు పెద్దగా వాడుకోలేదు అనిపించింది. పాటలు తక్కువే అయినా వాటిలో వాడిన లోకేషన్స్ బాగున్నాయి.సంగీతం ఫరవాలేదనిపించినా నేపధ్య సంగీతం ఊపిరి పోసింది.
davadas movie

తెలుగు బులెట్ పంచ్ లైన్ : దేవదాస్….దేవా-దాసుల స్నేహగీతం

తెలుగు బులెట్ రేటింగ్ : 3/5