మూడో ఫ్రంట్ …నాలుగో ఫ్రంట్ కాదు…పీపుల్స్ ఫ్రంట్… కేసీఆర్ కు దేవెగౌడ మ‌ద్ద‌తు

Deve Gowda is supported by KCR at bengaluru

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేసీఆర్ ప్ర‌తిపాదిత థ‌ర్డ్ ఫ్రంట్ కు తొలిసారి ఓ ప్రాంతీయ పార్టీ బ‌హిరంగంగా మ‌ద్దతు ప‌లికింది. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కేసీఆర్ తో క‌లిసి న‌డిచేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తంచేసింది. సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తో క‌లిసి కేసీఆర్ బెంగ‌ళూరులో జేడీఎస్ అధ్య‌క్షుడు దేవెగౌడ తో భేటీ అయ్యారు. అనంత‌రం దేవెగౌడ‌, కుమార‌స్వామి, కేసీఆర్, ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లారిగీ న‌మ‌స్కార అంటూ కేసీఆర్ క‌న్న‌డ‌లో ప్ర‌సంగం ప్రారంభించారు. దేశంలో గొప్ప మార్పులు సంభ‌వించాల్సిఉంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని 65 ఏళ్ల కంటే ఎక్కువ‌కాలం పాలించాయ‌ని..ప‌రిపాల‌న‌లో అవి దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు.

కావేరీ జ‌లాల కోసం ద‌శాబ్దాలుగా క‌ర్నాట‌క, త‌మిళ‌నాడు రాష్ట్రాలు పోట్లాడుకోవాల్సిన ప‌రిస్థితి ఎందుకు తలెత్తింద‌ని, ఏడు దశాబ్దాలుగా ఈ స‌మ‌స్య‌ను ఎందుకు పెండింగ్ లో ఉంచార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్, బీజేపీ తీరువ‌ల్లే కావేరీ లాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌ని, దేవెగౌడ లాంటి పెద్ద‌ల స‌హ‌కారంతో దేశంలో మార్పులు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపారు. మార్పు కోసం తాము చేస్తున్న ప్ర‌య‌త్నంలో జేడీఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం త‌దిత‌ర ఏ పార్టీలైనా క‌లిసిరావ‌చ్చ‌ని చెప్పారు. క‌ర్నాట‌క‌లో నివ‌సిస్తున్న తెలుగు ప్ర‌జ‌లంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. క‌ర్నాట‌క లో జేడీఎస్ త‌రపున ప్ర‌చారం నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు. న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పై కేసీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. స‌మాజం, పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల కోసం పాటుప‌డుతున్న ప్ర‌కాశ్ రాజ్ ను హీరోగా అభివ‌ర్ణించారు.

ప్ర‌కాశ్ రాజ్ క‌ర్నాట‌క‌కు చెందిన వ్య‌క్తి అని అంద‌రికీ తెలుస‌ని, ప్ర‌జ‌ల‌కోసం ఆయ‌న చేస్తున్న పోరాటం అభినంద‌నీయ‌మ‌ని కేసీఆర్ అన్నారు. 70 ఏళ్ల‌గా దేశం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేసీఆర్ ముంద‌డుగు వేశార‌ని, ఆయ‌న‌కు తాము స‌హ‌క‌రిస్తామ‌ని దేవెగౌడ చెప్పారు. త‌మ‌ది ఎవ‌రినో గద్దె దించ‌డానికి ఏర్పాటుచేస్తోన్న ఫ్రంట్ కాద‌ని, ఇది మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ కాద‌ని, పీపుల్స్ ఫ్రంట్ అని, ప‌థ‌కాల ఆధారిత ఫ్రంట్ అని దేవెగౌడ వ్యాఖ్యానించారు. దేశంలో ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తే న్యాయం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని ప్ర‌కాశ్ రాజ్ కోరారు. ఎవ‌రు హామీలు ఇచ్చి మోసం చేశారో ఎవ‌రు న్యాయం చేశారో ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని, ఏ పార్టీ ద్వారా న్యాయం జ‌రుగుతుందో అర్ధం చేసుకోవాల‌ని సూచించారు. దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూసి తాను భ‌య‌ప‌డుతున్నాన‌ని, ఇలాంటి స‌మ‌యంలో దేశంలో మార్పు కోరుకునే ప్ర‌జ‌లు క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.