Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే… బీజేపీ_జేడీఎస్ తో కలిసి హంగ్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందన్న విశ్లేషణలకు దేవెగౌడ తెరదించారు. 2008లో బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటుచేసిన సందర్బాన్ని గుర్తుచేసిన దేవెగౌడ అప్పుడు బీజేపీ కారణంగా తాము పడిన ఇబ్బందులు చాలని, ఇక ఎప్పటికీ ఆ పని చేయదల్చుకోవడం లేదని స్పష్టంచేశారు. కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఇన్ని రోజులూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు వారి మనసు మారిందనుకుంటున్నానని ఆయన విశ్లేషించారు.
జేడీఎస్ అధికారంలోకి రావడానికి ఈ సారి చాలా వరకు అవకాశం ఉందని, తమ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు బాగా చేశామని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రెండూ కలిసిపోవడం ఖాయమని, ఆ రెండు పార్టీలకు మధ్య రహస్య ఒప్పందం ఉందని దేవెగౌడ ఆరోపించారు. తమకు ఆ రెండు పార్టీలతోనూ పొత్తుపెట్టుకునే ఆలోచనలేదన్నారు. అటు చెదురు ముదురు ఘటనలు మినహా కర్నాటక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఐదుగంటల వరకు 65 శాతం పోలింగ్ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని రామ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 84శాతం ఓటింగ్ నమోదు కాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44శాతం మాత్రమే నమోదయింది.