తెలుగువారికీ సంబంధించి తొలి స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ప్రముఖ రచయతలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు. ఇక సినిమాను తెరకెక్కించాడానికి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు నిన్న కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. జూన్ 30న ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని కొణిదల ప్రొడక్షన్స్ చెప్పి వారికి అగ్రిమెంట్ రాసి ఇచ్చిందట. అయితే శనివారం రాత్రి రామ్చరణ్ మేనేజర్ అభిలాష్, ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కథపై వారికి ఎలాంటి హక్కులు లేవని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొణిదల ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. వీరికి పోలీసులు సర్ది చెప్పి పంపారు. ఐతే ఈ వ్యవహారంపై కొణిదెల ప్రొడక్షన్ ప్రతినిధులు మరోలా స్పందించారు. 100 సంవత్సరాలు దాటిన నేపధ్యంలో ఎవరైనా ఆ చరిత్రకారుడికి సంబంధించిన సినిమాను తెరకెక్కించవచ్చు.ఇందులో ఎవరికీ ఎలాంటి ఇష్యూస్ లేవని, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణకు ముందు చిత్ర యూనిట్.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపామని, ఉయ్యాలవాడ వారసులపై మాకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.