మహేంద్రసింగ్ ధోని బాటలోనే సురేశ్ రైనా నడిచాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తాను కూడా గుడ్ బై చెప్తున్నట్టు సురేశ్ రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘మీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిశ్చయించుకున్నందుకు గర్వంగా ఉంది. జైహింద్’ అంటూ ధోనితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. 2005లో టీమిండియాలో స్థానం సంపాదించిన రైనా వన్డే ఫార్మాట్లో జట్టుకు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
2010లో శ్రీలంకపై మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 226 వన్డేలు, 18 టెస్ట్‌లు, 78 టీ-20 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో ఒకటి, టీ-20ల్లో ఒక సెంచరీ సాధించాడు. వన్డే, టెస్టు,టీ-20 మూడు ఫార్మాట్లో భారత్ తరఫున సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రైనా రికార్డు సృష్టించాడు. కాగా, ధోని, ఆ వెంటనే రైనా రిటైర్మెంట్ ప్రకటనలతో క్రికెట్ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
34 ఏళ్ల రైనా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించాడు. రెండు ప్రపంచ కప్‌లు ఆడిన అనుభవముంది. సుదీర్ఘ కెరీర్లో కేవలం 18 టెస్ట్ మ్యాచ్‌లే ఆడిన రైనా 768 పరుగులు సాధించాడు. దాంట్లో ఓ సెంచరీ కూడా ఉంది. 226 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ ఐదు శతకాలు, 36 అర్థ శతకాలతో 5615 పరుగులు సాధించాడు. 36 వికెట్లు కూడా తీశాడు. ఇక టీ-20 ఫార్మాట్లో రైనా మంచి ఫామ్ కొనసాగించాడు. టీమిండియా తరఫున 78 మ్యాచ్‌లు ఆడి 1600కు పరుగులు చేశాడు. 193 ఐపీఎల్ మ్యాచుల్లో 5,368 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు.