అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నీ ముగిశాక తన ఫ్యూచర్‌పై నిర్ణయం తీసుకుంటాడని ధోనీ సన్నిహితుడుకొరు తెలిపారు. గతనెలరోజులుగా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడంపై తీవ్ర మేథోమథనం చేస్తున్నాడని వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ ముగిశాకా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. టోర్నీ ముగిశాక కొంతకాలంపాటు అతను సైన్యంలో సేవలందించాడు. అనంతరం వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. మెగటోర్నీ తర్వాత భారత్.. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడిన సిరీస్‌లలో ధోనీ బరిలోకి దిగలేదు. అయితే ధోనీ స్థానంలో వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈక్రమంలో ఈ జార్ఖండ్ డైనమైట్ తిరిగి జట్టులోకి రావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై తనను వచ్చే జనవరి వరకు అడగవద్దని విలేకరులకు సూచించారు. జనవరి తక్ మత్ పూచో అని ఆ ఈవెంట్‌లో ధోనీ అన్నాడు. దీంతో ధోనీ మళ్లీ ఎప్పుడు మైదానంలో ఎప్పుడు అడుగుపెడతాడో అని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వచ్చే ఐపీఎల్ సీజన్ ముగిశాక టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటిస్తామని భారత ప్రధాన కోచ్ రవి శాస్త్రి పేర్కొన్న క్రమంలో ధోనీ ఈ విధంగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.