అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు పూర్తి స్థాయిలో వినోద రంగంపై దృష్టి పెట్టాడు. అతని సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా త్వరలో ఒక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ధోని భార్య సాక్షి సింగ్ వెల్లడించింది. ఇందు కోసం ఒక పురాణ గాథను కథగా ఎంచుకున్నట్లు ఆమె చెప్పింది. ‘రాబోయే సిరీస్ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది.
ఇంకా ప్రచురితం కాని ఒక పౌరాణిక సైన్స్ ఫిక్షన్ పుస్తకం హక్కులను మేం రచయిత నుంచి తీసుకున్నాం. ఒక అఘోరి ప్రయాణాన్ని అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో చూపిస్తాం. అ ఘోరి చెప్పే విషయాల్లో భూత, వర్తమాన, భవిష్యత్ గురించిన అంశాలు ఉంటాయి. విశ్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఇందులో చూపిస్తాం.
ఒక సినిమా తీయడంకంటే వెబ్ సిరీస్ మా ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని ఇందులోకి అడుగు పెడుతున్నాం’ అని సాక్షి వివరించింది. ఐపీఎల్‌లో రెండేళ్లు నిషేధానికి గురైన తర్వాత పునరాగమనం చేసిన 2018లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స ప్రయాణాన్ని చూపిస్తూ ‘రోర్ ఆఫ్ లయన్’ పేరుతో గత ఏడాదే ధోని బ్యానర్ నుంచి డాక్యుమెంటరీ వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వినోద రంగంలో అడుగు పెట్టడం మాత్రం దీంతోనే మొదలు కానుంది. కొత్త సిరీస్‌కు సంబంధించి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటారు.