ఆర్మీతో ఎక్కువ సమయం గడపనున్న ధోని

ఆర్మీతో ఎక్కువ సమయం గడపనున్న ధోని

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతూ ఆగస్టు 15న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటైర్‌మెంట్‌ తర్వాత ధోని ఎక్కువ సమయం ఆర్మీతో గడుపుతారని ఆయన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్‌ పాండే తెలిపారు. ధోని రిటైర్‌మెంట్‌ నిర్ణయం వల్ల తన బ్రాండ్‌ వాల్యూ తగ్గుతుందనే వాదనను ఆయన ఖండించారు. ఈ సం‍దర్భంగా అరుణ్‌ పాండే మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ధోని రిటైర్‌మెంట్‌ గురించి ప్రకటన వస్తుందని నాకు తెలుసు.

కానీ గత నెలలో అది 2022కి వాయిదా పడుతూ నిర్ణయం వెలువడింది. అయితే ఇంత అకస్మాత్తుగా ధోని రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తాడని నేను ఊహించలేదు. ఎందుకంటే ధోని ఇప్పటికే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. టీ20 వరల్డ్‌ కప్‌, ఐపీఎల్‌ వాయిదా పడటం కూడా ధోని మీద ప్రభావం చూపించిందనుకుంటాను. ప్రస్తుతం అతడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకే ఇలా అకస్మాత్తుగా రిటైర్‌మెంట్‌ గురించి ప్రకటన చేశాడు’ అన్నారు పాండే.

ఆగస్టు 15 ఆర్మీకి ఎంతో ప్రత్యేకం అందుకే ధోని ఆ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించాడన్నారు అరుణ్‌ పాండే. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందారు ధోని. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి తరువాత, అతను పారాచూట్ రెజిమెంట్‌తో కలిసి ఒక నెలకు పైగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఇక మీదట ధోని ఆర్మీతో ఎక్కువ సమయం గడుపతాడన్నారు పాండే. అంతేకాక వాణిజ్య కార్యక్రమాలకు, ఇతర కమిట్‌మెంట్లకు కూడా సమయం కేటాయిస్తాడని తెలిపారు. త్వరలోనే వీటి గురించి పూర్తి స్థాయిలో చర్చించి.. ముదుకు వెళ్తామన్నారు.

చాలా సందర్భాల్లో అథ్లెట్‌ బ్రాండ్‌ విలువ పదవీ విరమణ తర్వాత తగ్గుతుంది. కానీ ధోని విషయంలో అలా జరగదన్నారు పాండే. ‘ప్రపంచ కప్‌(జూలై 2019) నుంచి మేం పది కొత్త బ్రాండ్లతో సైన్‌ అప్‌ చేశాం. అవి కూడా లాంగ్‌ టర్మ్‌ అసైన్‌మెంట్లు. ధోని అంటే క్రికెట్‌ మాత్రమే కాదు యూత్‌ ఐకాన్‌. అతని విజయాలు వ్యక్తిగతమైనవి కావు.. అవి జట్టుకు, దేశానికి సంబంధించినవి. అందువల్లే ధోని విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు’ అన్నారు పాండే. ధోని మరో 2,3 ఐపీఎల్‌ సీజన్లలో ఆడతాడన్నారు పాండే.