ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. బీసీసీఐ సవరించిన తాజా రూల్స్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నలుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ తురుపు ముక్క, జట్టు సారధి ధోనిని మొదటి ప్రాధాన్యతగా రీటైన్ చేసుకుంటుందని ఫ్రాంఛైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్ ఇదివరకే వెల్లడించాడు.
ఈ నేపథ్యంలోనే ధోని తాజాగా తన మనసులో మాటను బహిర్గతం చేశాడని సమాచారం.తాను రీటెన్షన్ పాలసీకి వ్యతిరేకమని, తనను రీటైన్ చేసుకుని అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోవద్దని ధోని సూచించినట్లు శ్రీనివాసన్ స్వయంగా ప్రకటించాడు. అయితే, ఈ ఒక్క విషయంలో తాము ధోని మాటను పక్కకు పెడతామని, అతన్ని వచ్చే సీజన్ కోసం తప్పక రీటైన్ చేసుకుంటామని శ్రీనివాసన్ చెప్పడం విశేషం.
కాగా, ఫ్రాంఛైజీలు తమ మొదటి ప్రాధాన్యత ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్పి ఉంటుంది.ఇదిలా ఉంటే, 2008 నుంచి సీఎస్‌కేతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న ధోని మధ్యలో రెండు సీజన్లు మినహా లీగ్ మొత్తం సీఎస్‌కేతో పాటే ఉన్న విషయం తెలిసిందే. ధోని సారధ్యంలో సీఎస్‌కే ఇటీవలి సీజన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో ధోని సీఎస్‌కే తరఫున సాధించిన టైటిల్‌ల సంఖ్య నాలుగుకు చేరింది.