వరల్డ్‌కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచే.. ధోనీకి ఆఖ‌రిదా..!

Dhoni's last match to be played by India in World Cup

ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ తీరుపై అభిమానులు, మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీలో భారత మిడిలార్డర్ వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో స్థానం బలోపేతం చేయడానికి రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడించారు. ఈ వరల్డ్‌కప్‌లో 40-50 మధ్య ఓవర్లలో అత్యంత తక్కువ ైస్ట్రెక్‌రేట్ ఉన్న ఆటగాళ్లలో జాదవ్, ధోనీ ఉండటం గమనార్హం. టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన మహీ 223 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్‌ఫినిషర్‌గా పేరొందిన ధోనీ ఇప్పుడు జట్టుకు భారమయ్యాడు. విమర్శలతో సంబంధం లేకుండా విశ్వసమరం అనంతరం ధోనీ వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మెగా టోర్నీలో టీమిండియా ఆడే ఆఖరి మ్యాచే ధోనీకి అంతర్జాతీయ క్రికెట్లో చివరిది కావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరి.. లార్డ్స్ మైదానంలో విశ్వవిజేతగా నిలిస్తే దిగ్గజ క్రికెటర్‌కు అదే వీడ్కోలు మ్యాచ్ కానుంది. ఓ బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ధోనీ గురించి ఎవరికీ అంతగా తెలియదు. వరల్డ్‌కప్ తర్వాత అతను కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకోవాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలే. వాటిని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుత సమయంలో కూడా అతడు ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నాడు.