బాబు ఇల్లు మునిగిందా….నిజం ఎంత ?

chandrababu-housecan-not-be-drowned-sacrificing-people

ఏపీలో వరద రాజకీయం మొదలయ్యింది. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో.. చంద్రబాబు నివాసం వరద నీటిలో మునుగిందంటూ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ-ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు నివాసం కృష్ణాకు వచ్చిన వరదతో మునిగిపోయిందంటూ వైసీపీ చెబుతుంటే..

అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ కుట్ర చేసి.. నదికి వరద నీరు భారీగా చేరినప్పటికీ.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా బాబు ఇంట్లోకి నీళ్లు వెళ్లేలా చేశారని విమర్శిస్తోంది. ఆ వంకతో బాబు ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తోంది.

సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిజంగానే చంద్రబాబు నివాసం వరదలో మునిగిపోయిందా.. వైసీపీ వాదనలో నిజమెంత అనే ప్రశ్నలు మొదలయ్యాయి. నివాసం లోపలి వరకూ నీరు వచ్చే పరిస్థితి ఉంటే.. విజయవాడ వైపు కూడా కృష్ణానది చాలా వరకూ నగరంలోకి ప్రవహిస్తుందట.

కృష్ణలంక వంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నాలుగున్నర లక్షల క్యూసెక్కులు వస్తే బ్యారేజ్ దగ్గర వాటర్ లెవెల్ 17.4 మీటర్లు ఉంటుంది. ప్రకాశం బ్యారేజీలో ఎప్పుడు మెయింటైన్ చేసే లెవెల్ 17 మీటర్లు.

ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న వీటీటీపీఎస్ విద్యుత్ కేంద్రానికి నీళ్లు అందడానికి ఎప్పుడూ బ్యారేజ్‌లో ఆ ఎత్తున నీటిని మెయింటైన్ చేస్తారు. ఆ లెవెల్ నీరు లేకపోతే కాలువ ద్వారా వీటీటీపీఎస్‌కు నీరు అందదు. అయితే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంట్లోకి నీళ్లు రావాలంటే 19 మీటర్ల కంటే ఎక్కువగా వరద రావాలి.

అంటే 8 లక్షల క్యూసెక్కులుపైగా వరద ఉండాలి. రాజధాని అమరావతికి వరద రావాలంటే 24 మీటర్ల వరకూ వరద దాటాలి.. అంటే ఒక 25 లక్షల క్యూసెక్కులు వరద రావాలి( ఎగువ ప్రాంతంలో రెండు మూడు డ్యాములు ఒకేసారి ఖాళీ అవ్వాలట).

ఇప్పుడు ఉన్న నీటి కంటే ఇంకా కనీసం 2 మీటర్లు.. అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ చంద్రబాబు ఇంటి పరిసరాల్లోకి నీరు చేరే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.

ఎందుకంటే కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలు నిర్మించిన యజమానులు కూడా ఆ స్థాయిలో వరదను ముందుగానే ఊహించి.. నది వరద వచ్చినపుడు ఎంతవరకూ నీరు చేరుతుందో ముందుగానే ఊహించుకుని అంతకంటే ఎక్కువ ఎత్తులో మట్టి, రాళ్లతో నింపి తర్వాత దానిపై గెస్ట్ హౌస్‌లు కట్టారట.