చిదంబరానికి ఊరట లభించేనా ? 

చిదంబరానికి ఊరట లభించేనా ? 

మనీ లాండరింగ్ కేసులో చిక్కుల్లో పడ్డ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఈరోజైనా ఊరట లభిస్తుందా.. ఆయన బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఏం చెబుతుంది…? వయసు రీత్యా తీహార్ జైలుకు పంపించవద్దన్న ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది. అదే సమయంలో ఆయన కస్టడీని ఎల్లుండి వరకు పొడగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టులో వరుస విచారణ జరుగుతోంది.

చిదంబరం తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. చిదంబరం వయసును దృష్టిలో ఉంచుకుని.. బెయిల్ మంజూరు చేయాలని.. లేదా హౌజ్ అరెస్ట్ చేయాలని సిబాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప తీహార్ జైలుకు మాత్రం పంపించవద్దని కోరారు.

ఇదే విషయాన్ని ట్రయల్ కోర్టులో అప్పీల్ చేయాలని సుప్రీం సూచించింది. బెయిల్ పై తేల్చాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టుకు సూచించింది. చిదంబరానికి గురువారం వరకు సీబీఐ కస్టడీ పొడిగించింది. అటు చిదంబరం సీబీఐ కస్టడీ ముగియడంతో.. ఆయన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు తేల్చాలని సూచించినా.. బెయిల్ వ్యతిరేకించేందుకు టైమ్ కావాలని సీబీఐ లాయర్.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.

దీంతో విచారణను ఇవాళ్టికి వాయిదా పడింది. వ్యక్తిగత స్వేచ్ఛ విషయానికి వస్తే రిక్షావాడి కంటే చిదంబరానికి ఎక్కువ మినహాయింపులేమీ ఉండవని సీబీఐ లాయర్ వాదించారు. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ నిధులను భారీగా బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేరును కూడా సీబీఐ చార్జీషీట్‌లో ప్రస్తావించారు. గత వారం చెన్నైలోని ఆయన నివాసంలోని సీబీఐ అధికారులు.. చిదంబరంను అరెస్ట్ చేశారు.