Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఇక లాంఛనమే అనిపిస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు అభిమానులతో సమావేశం అయిన సందర్భంగా రజని వ్యవహరించిన తీరు మాత్రం అద్భుతం. ఇన్నాళ్లు ఓ అడుగు ముందుకు, ఓ అడుగు వెనక్కి వేసిన రజని ఇప్పుడు నిండైన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మెగా స్టార్ చిరంజీవితో పోల్చుకుంటే మాస్ లో కాస్త ఎక్కువే క్రేజ్ వున్న రజని తాజా స్పీచ్ తో ఇన్నాళ్లు ఎందుకు రాజకీయ ప్రవేశం గురించిన అనౌన్సమెంట్ చేయలేదో అర్ధం అవుతుంది. అసలు రజని, చిరు మధ్య వున్న తేడా ఏంటో కూడా తెలిసిపోతోంది.
రాజకీయ రంగప్రవేశాన్ని ఓ యుద్ధంగా అభివర్ణించిన రజని అక్కడ గెలవాలంటే బలం మాత్రమే ఉంటే చాలదని, వ్యూహం కూడా కావాలని చెప్పడం ఆయన పరిణితికి అద్దం పడుతోంది. ఇన్నాళ్లు వెనకడుగు వేస్తున్నారు అనిపించినా ఇప్పుడు అది ముందువెనుకా ఆలోచించడం అనిపిస్తోంది. ఫాన్స్ ఎంత బలవంతపెట్టినా సరైన సమయం కోసం రజని ఎంతో సహనంతో వేచి చూసారు. ఇక ప్రజారాజ్యం స్థాపించినప్పుడు మెగా స్టార్ చిరు వర్తమాన రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. బరిలో వై.ఎస్, చంద్రబాబు లాంటి ఉద్దండులు వున్న విషయాన్ని లెక్క చేయకుండా 2009 ఎన్నికలకు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ కన్నా తక్కువ సమయంలో పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలవాలన్న ఆశ కూడా చిరు సినీ ఫక్కీలో రికార్డులు కోణంలో ఆలోచించడం వల్ల పుట్టిందే. రజని చెప్పినట్టు కాకుండా ఓ వ్యూహం లేకుండా కేవలం సొంత బలాన్ని నమ్ముకుని మాత్రమే చిరు ప్రజారాజ్య స్థాపనకు నడుం కట్టారు.
ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది రాజకీయ ప్రకటన చేసేటప్పుడు చిరు పక్కన వేదిక మీద ఎవరూ లేకుండా చూసారు. ఆయనకు సినీ ప్రస్థానంలో తోడునీడగా వుండే వాళ్ళు ఎవరూ అక్కడ కనిపించలేదు. ఆయనకి స్టార్ డ౦ రావడానికి కారణం అయిన వాళ్ళు తిరుపతిలో కనిపించలేదు. ఇంకా ప్రకటన అయితే చేయలేదు కానీ ఆ దిశగా ఓ నిర్ణయం తీసుకుని ఫాన్స్ తో చర్చించాలి అనుకున్నప్పుడే రజని ఎవరిని వెంటబెట్టుకొచ్చారో చూసారా ?. విలన్ గా చేసే తనని హీరోగా పెట్టి ఓ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత కలై జ్ఞానం, తనకు స్టార్ స్టేటస్ తో పాటు స్టైల్ నేర్పించిన దర్శకుడు జాన్ మహేంద్రన్ ని దగ్గరబెట్టుకుని రజని తన అభిమానుల ముందుకు వచ్చారు. ఆ ఇద్దరి వల్లే తన జీవితం మేలిమలుపు తిరిగిన విషయాన్ని రజని పదేపదే చెప్పారు. తొలిసారి హీరోగా చేసిన నిర్మాత కలై జ్ఞానం ఇప్పటిదాకా ఇంకో కాల్ షీట్ కోసం అడగకపోవడాన్ని రజని ఎంతో గొప్పగా చెప్పారు.
ఈ రెండు విషయాలు చూసాక చిరు, రజని మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయాల్లో రజని ని తక్కువ అంచనా వేయలేమని అర్ధం అవుతోంది.