ఆర్థిక కార్యకలాపాల పునప్రారంభంతో యాత్రలు, ఆతిథ్యం, ఆన్లైన్ ఫోరమ్స్, సరుకు రవాణా వంటి రంగాలను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ నివేదిక వెల్లడించింది. 40,000 పైచిలుకు వెబ్‌సైట్స్, యాప్స్‌ను విశ్లేషించి ట్రాన్ ఈ నివేదిక రూపొందించింది.
ట్రాన్స్ నివేదిక ప్రకారం.. ‘డిజిటల్ వేదికగా మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నాలు భారత్‌లో గతేడాదితో పోలిస్తే 2021లో.. యాత్రలు, ఆతిథ్య రంగంలో 269 శాతం, డేటింగ్ యాప్స్ వంటి ఆన్లైన్ ఫోరమ్స్‌లో 267శాతం, సరుకు రవాణా రంగంలో 94 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో లాక్డౌన్లు ఎత్తివేశాక యాత్రలు, ఆతిథ్య కార్యకలాపాలు మరింత ప్రధాన స్రవంతిగా మారడంతో మోసగాళ్లు ఈ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు’ అని వివరించింది.
గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఎక్కువగా మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు టూరిజం సెక్టార్‌ని లక్ష్యంగా చేసుకోవడంతో పర్యటనల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటం మేలని ట్రాయ్ సూచించింది. కొత్త ప్రదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.