ప్రముఖ డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ప్రముఖ డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

కరోనా వైరస్‌ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్‌ తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోగా తేజకు పాజిటివ్‌గా తేలింది.

కాగా ఈ విషయంపై తేజ స్పందిస్తూ.. ‘అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చకున్నా. మా షూటింగ్‌లో సభ్యులకు గానీ, మా కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదు. నా ఒక్కడికే కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా’ అని తెలిపారు. మరోవైపు తేజకు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ నెల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆ మహమ్మారి బారిన పడటం గమనార్హం.