Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రేమ కథలకు పెట్టింది పేరు అయిన తేజ దర్శకత్వంలో ఎంతో మంది కొత్త నటీనటులు తెలుగు తెరకు ఎంపిక అయిన విషయం తెల్సిందే. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు తీయడంలో విఫలం అయ్యి వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాడు. దాదాపు పది సంవత్సరాలకు పైగా సక్సెస్ లేకుండానే కెరీర్‌ను నెట్టుకు వచ్చాడు. ఎట్టకేలకు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో రానాకు హిట్ ఇచ్చి తన పరువు కాపాడుకున్నాడు. ఇన్నాళ్లకు తేజకు మంచి సక్సెస్ రావడంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చాలా కాలంగా వెంకటేష్‌తో తేజ ఒక చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాని వెంకీకి తేజపై నమ్మకం కలగక పోవడంతో వాయిదాలు వేస్తూ వచ్చాడు.
తాజాగా రానాకు హిట్ ఇవ్వడంతో వెంకీ వెంటనే డేట్లు ఇచ్చేశాడు. నవంబర్‌లో తేజ, వెంకటేష్‌ల కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వేసవిలో ఆ చిత్రాన్ని విడుదల చేయాలని తేజ భావిస్తున్నాడు. ఇక మరో వైపు తేజకు బాలయ్య కూడా పిలిచి ఆఫర్ ఇచ్చాడు. తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా ఒక పొలిటికల్ డ్రామా తీయాలని బాలయ్య ముచ్చట పడుతున్నాడు. రానాతో పొలిటికల్ సినిమా తీసి సక్సెస్ అవ్వడంతో తేజకు ఈ ఛాన్స్‌ను బాలయ్య ఇచ్చాడు. బాలయ్య పిలిచి ఎన్టీఆర్ బయోపిక్‌ను చేయాల్సిందిగా అడిగారని, అందుకు తాను ఓకే చెప్పాను అంటూ తాజాగా తేజ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
సినిమాల కోసం ఎదురు చూసిన రోజుల నుండి ఒకే సారి రెండు సినిమాలు చేసే అవకాశం రావడంతో తేజ ఆనందానికి హద్దులు లేవనుకుంటా. కాలం కలిసి వచ్చి ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సక్సెస్ అయ్యింది. కాలం కలిసి వచ్చి రెండు పెద్ద హీరోల సినిమాలకు పని చేసే అవకాశం వచ్చింది. మరి అదే కాలం కలిసి వచ్చి ఆ రెండు సినిమాలను కూడా సక్సెస్ చేసుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా అనేది చూడాలి.