తమిళ కురువృద్దుడు కరుణ ఆరోగ్యం విషమం…ఇంటికి క్యూ !

DMK chief karunanidhi health condition critical
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చాలా కాలంగా అయన చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అయితే ఆయన మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారన్న వార్త కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రముఖులు గురువారం రాత్రి ఆయన నివాసానికి తరలివచ్చారు. అయితే ఒకవేళ ఇదే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ తెలిస్తే పరిస్థితి తీవ్రమవుతుందన్న ఉద్దేశ్యంతో వైద్యులు స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. ఆయనకీ జ్వరం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌తో ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని తెలిపారు. అయితే అన్నాడీఎంకే నేత, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు కూడా కరుణ ఇంటికి రావడంతో కరుణ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు రేకెత్తాయి.
ఇక సొంత పార్టీ నేతలైన డీఎంకే నేతలైతే రోజంతా అక్కడే గడిపారు. స్టాలిన్ కూడా తండ్రి పక్కనే ఉన్నారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్, డీపీఐ నేత తిరుమావళవన్, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, పలువురు వామపక్ష నేతలు కరుణను పరామర్శించారు. ఇంతమంది ప్రముఖులు ఆయన్ని సందర్సిన్చాడంతో ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. అయితే, తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను స్టాలిన్ ఖండించారు. మూత్రాశయ నాళంలో ఇన్ఫెక్షన్‌ కారణంగా జ్వరంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ బయటకి ప్రకటించకపోయినా నిజానికి ఆయన ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.