ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పని చేసిన తాను ఉన్నతాధికారుల స్వార్థానికి, అధికార దాహానికి బలై కొన్నేళ్లుగా వైద్య వృత్తికి దూరమైనట్లు దావణగెరెలో ఆటోడ్రైవర్‌గా మారిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎంహెచ్ రవీంద్రనాథ్ ఆవేదన చెందారు. ఆయన దావణగెరెలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి జిల్లాలో జిల్లాస్థాయిలో వైద్యాధికారిగా ఉన్న తనను 2017–19లో అప్పటి జడ్పీ సీఈవో ఆయన స్నేహితున్ని ఆర్సీహెచ్ వైద్యునిగా నియమించాలని సూచించారు. దీనికి తాను నిరాకరించడంతో అప్పటి నుంచి వేధించడం ప్రారంభించారని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలు అంటగట్టి సస్పెండ్ చేశారని, కొన్నాళ్లకు తాలూకా వైద్యాధికారిగా బదిలీ చేశారని వాపోయారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో లోపాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏ పనైనా చేసి జీవితం సాగించవచ్చని చాటేందుకు 4 రోజుల నుంచీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నానన్నారు. మళ్లీ పోస్టింగ్ రాకపోతే చివరి వరకు ఆటో డ్రైవర్‌గానే కొనసాగుతానని డాక్టర్ తెలిపారు. తన దుస్థితికి కారకులైన అధికారులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.