మాతృత్వానికి నోచుకోని మహిళలకు వైద్యం అందించాల్సిన వైద్యురాలు పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ముసుగులో కొన్నేళ్లుగా పసిపిల్లల్ని విక్రయిస్తోంది. గుట్టుగా సాగుతున్న ఈ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్ పచ్చిపాల సుమిత్రా పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో డాక్టర్ నమత్రను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ సాయంత్రం విశాఖ కోర్టులో హాజరు పరచనున్నారు. అలాగే నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
పిల్లల అక్రమ రవాణాలో సృష్టి ఆస్పత్రిదే కీలక పాత్ర. 2018లో ఆస్పత్రిలో కేసు నమోదు అయినా తీరు మారలేదు. పైగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చుకుని పిల్లల అక్రమ రవాణా దందాను కొనసాగించింది. విశాఖతో పాటు హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలో ఉచిత వైద్య శిబిరాల పేరిట అమాయకులపై వల విసిరి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దందా కొనసాగిస్తోంది.
ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతల వివరాలు సేకరించి, ఉచితంగా డెలివరీ చేయిస్తామంటూ విశాఖ సృష్టి ఆస్పత్రికి తరలించేవారు. డెలివరీ తర్వాత తల్లులకు కొంత మొత్తాన్ని ఇచ్చి పిల్లలు లేని ధనవంతుల దగ్గర పెద్ద మొత్తం వసూలు చేసి ఆ పసికందులను విక్రయించేవారు. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే చిన్నారులు పుట్టినట్లుగా తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించేవారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.