Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆస్పత్రిని దేవాలయంగా… అందులోని వైద్యులను దేవుళ్లుగా భావిస్తుంటారు ప్రజలు. అనారోగ్యాన్నితగ్గించి మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని నిలబెట్టి… ఆస్పత్రులు, వైద్యులు కొత్త జీవితం ఇస్తారని భరోసాతో ఉంటారు. ఇక మహిళలకు పునర్జన్మగా భావించే ప్రసవ సమయంలో తల్లీ, బిడ్డల ప్రాణాలకు వైద్యులనే రక్షణ కవచమనుకుంటారు. కానీ ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు చేసిన నిర్వాకం చూస్తే… వారిని డాక్టర్లన్న పదంతోనే పిలవలేం. వైద్యులు అన్న మాటే కాదు… వాళ్లనసలు మనుషులనే అనుకోలేం. ఓ చిన్నారి విషయంలో వారు చూపిన నిర్లక్ష్యానికి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే…
మ్యాక్స్ ఆస్పత్రిలో ఇటీవల ఓ మహిళ ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ కవలలు చనిపోయారని చెప్తూ ఆస్పత్రి వైద్యులు ప్లాస్టిక్ బ్యాగ్ లో ఆ చిన్నారులను ప్యాక్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. వైద్యుల మాటలను నమ్మిన తల్లిదండ్రులు గుండె పగిలే విషాదాన్ని పంటిబిగువున దాచుకుని ఇద్దరు చిన్నారులను అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. మార్గమద్యంలో ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిలో కదలిక కనిపించింది. దీంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బతికి ఉన్న చిన్నారిని పితమ్ పురా ప్రాంతంలోని ఓ క్లినిక్ లో చేర్పించారు. కానీ ఓ చిన్నారి బతికిఉందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎక్కువసేపు నిలవలేదు. వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా ఇద్దరు చిన్నారులు చనిపోయారని చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది బతికి ఉన్న చిన్నారిని కూడా చనిపోయిన చిన్నారితో కలిపి ఒకే ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచారు. దీంతో ఆ చిన్నారికి ఇన్ ఫెక్షన్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండో చిన్నారి కూడా మరణించింది.
ఆస్పత్రి వైద్యులే కాదు… అక్కడి సిబ్బంది సైతం విధుల్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్వవహరించడం వల్లే ఈ దారుణం జరిగింది. చిన్నారులను ప్లాస్టిక్ బ్యాగులో ఉంచేటప్పుడైనా బతికి ఉన్న చిన్నారిని ఎవ్వరూ గమనించకపోవడం అత్యంత విషాదం. ఆస్పత్రి నిర్వాకానికి ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న వారి తండ్రి ఆశిష్ కుమార్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై ఆస్పత్రి చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెహతా, విశాల్ గుప్తా అనే వైద్యులను విధుల నుంచి తొలగించింది. ఈ దారుణంపై ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక విచారణలో భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి. చిన్నారి బతికే ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేదని తేలింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో చనిపోయిన పిల్లల వద్దే చికిత్స అందిస్తున్న పిల్లల్ని పడుకోబెడుతున్నట్టు వెల్లడయింది. ఈ నివేదిక ఆధారంగా ఆస్పత్రి లైసెన్సును రద్దు చేయించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.