Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లవ్ జీహాద్ పై ఈ తరహా వివాహాలు ఎక్కువ జరుగుతున్న కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న ప్రేమవివాహాలన్నింటిని లవ్ జీహాద్ గా భావించరాదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానూర్ కు చెందిన శృతి, అనీస్ అహ్మద్ ల మతాంతర వివాహంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు కేసు దృష్ట్యా తల్లిదండ్రుల దగ్గర బందీగా ఉన్న శృతి నిర్భయంగా భర్తతో వెళ్లిపోవచ్చని తీర్పు ఇచ్చింది. హిందూ మతానికి చెందిన శృతి ఇష్టపూర్వకంగా ఇస్లాం మతం స్వీకరించింది. అనంతరం ముస్లిం వర్గానికే చెందిన అనీస్ ను వివాహమాడింది. అయితే శృతిని అనీస్ బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, పెళ్లిచేసుకున్నాడని, ఇది లవ్ జీహాద్ కిందకు వస్తుందని ఆరోపిస్తూ కొన్ని హిందూ సంస్థల సాయంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసువేశారు.
అనంతరం శృతిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంటికి తీసుకొచ్చి బందీగా ఉంచారు. దీనిపై అనీస్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులు ఘర్ వాపసీ పేరుతో మతం మార్పించారని ఆయన ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హిందూ, ముస్లింల మధ్య జరిగిన అన్ని వివాహాలనూ లవ్ జీహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని, ప్రతి మతాంతర వివాహాన్ని మత కోణంలో పరిశీలించరాదని వ్యాఖ్యానించింది. మతాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. కేరళ రాష్ట్రంలో లవ్ జీహాద్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రవాదసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంఘం ఎన్ ఐఏ విచారణ చేపట్టింది. కేరళలో గత ఏడాది వ్యవధిలో ఇలాంటివి 90 పెళ్లిళ్లు జరిగినట్టు ఎన్ ఐఏ దర్యాప్తులో తేలింది. శృతి కేసుతో లవ్ జీహాద్ విషయం వెలుగుచూసినప్పటికీ…హైకోర్టు మాత్రం ఆమె వివాహం లవ్ జీహాద్ కిందకు రాదని తేల్చిచెప్పడం గమనార్హం.