నగరంలో కలకలం రేపిన యాంటీ వైరల్ డ్రగ్స్ దందాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, చెన్నై, గుజరాత్ల నుంచి అక్రమంగా డ్రగ్‌ను సరఫరా చేసినట్లు విచారణలో తెలిసింది. డీలర్లు నుంచి రూ.30 వేలకు కొనుగోలు చేసిన ముఠా ఆ డ్రగ్‌ను రూ.లక్షకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. కరోనా యాంటీ వైరల్ మెడిసిన్ విక్రయించేందుకు ముఠా సభ్యులు విమానాల్లోను ప్రయాణం చేశారు. కాగా బ్లాక్ మార్కెట్లో కోవిడ్ డ్రగ్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఠా సభ్యుడు గగన్ ఖురానాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం విచారించగా పలు విషయాలను వెల్లడించాడు. ఆక్ట్‌మ్రా, కోవిఫర్ మందులను చెన్నై, హైదరాబాద్‌లో ముఠా అమ్మకాలు నిర్వహించింది. అంతేకాకుండా యాంటీవైరల్ డ్రగ్స్ మాఫియా వెనకాల రెండు ప్రైవేట్ ఆస్పత్రుల హస్తం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ముఠా సభ్యులు చెప్పిన రెండు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డాక్టర్ల పేరుపై కరోనా యాంటీవైరస్ డ్రగ్ తెప్పించి.. రూ.30 వేల విలువైన డ్రగ్‌ను లక్షా 20 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే రూ.5 వేల విలువైన డ్రగ్‌ను 50 వేలకు అమ్ముతున్నట్లు తేలింది. ఆస్పత్రికి వచ్చిన డ్రగ్‌ను బ్రోకర్ల ద్వారా బ్లాక్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఠా సభ్యుల నుంచి 35.5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మందుల విషయంలో ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్, మెడికల్ రిప్రజెంటెటివ్స్, మెడికల్ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.