భీమవరంలో డ్రగ్స్ సరఫరా ముఠా గుట్ట రట్టయింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు భీమవరం పోలీసులు తెలిపారు. వివరాలు.. భీమవరానికి చెందిన భానుచందర్ అనే యువకుడు డ్రగ్స్ కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. నెధర్లాండ్స్ నుంచి డ్రగ్స్ పార్సిల్ వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్శిల్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా భీమవరానికి చెందిన భానుచందర్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. భీమవరంలో డ్రగ్స్, గంజాయిని పలువురికి సరఫరా చేసే వెంకట సాయిరాం అనే యువకుడి ఆచూకీ దొరికింది.
సాయిరాం ఇచ్చిన వివరాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ఇద్దరు యువకులను, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు భానుచందర్ బంధువు పూర్ణ చంద్రరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. భానుచందర్ అండ్ టీంను మీడియా ముందు మంగళవారం ప్రవేశపెట్టిన నర్సాపురం డీఎస్పీ నాగేశ్వరరావు.. పూర్తి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. మరి కొందరిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు.