గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ హద్దు మీరుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు తాగి కార్లు బైకులు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా వీరి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తాజ్ హోటల్ సమీపంలో సౌమ్య, ప్రేమిక, అక్షయ ముగ్గురు యువతులు కనకమామిడి వైపు వెళుతున్నారు.
అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నకారు, ఎదురుగా వచ్చిన వీరి స్కూటీని ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక సంఘటన స్థలంలోనే చనిపోగా.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సౌమ్య కూడా మృతి చెందింది. ప్రస్తుతం అక్షర ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు.