మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం చేశాడు. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైడ్ వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన చైన్నైలో శనివారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ పోలీసు కానిస్టేబుల్.. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైండ్ వ్యక్తుల వాకింగ్ స్టిక్స్‌ను విరిచి అనంతరం వారిపై చేయి చేసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల అరుపులతో ఘటనాస్థలంలోని స్థానికులు ఆ కానిస్టేబుల్‌ను పట్టుకొని ట్రిప్లికేన్ పోలీసులకు అప్పగించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను జీ.దినేశ్కుమార్గా ట్రిప్లికేన్ పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే దినేష్ కుమార్ తాజాగా మెడికల్ లీవ్ పూర్తి చేసుకొని శనివారమే విధుల్లోకి చేరాడని పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు కూడా సదరు కానిస్టేబుల్ పోలీసు యూనీఫామ్‌లో లేడని.. సివిల్ డ్రెస్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై అగరుబత్తులు అమ్ముకునే బ్లైండ్ వ్యక్తులపై పోలీసు కానీస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.