Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న కథువా అత్యాచార కేసు దర్యాప్తుపై డీఎస్పీ శ్వేతాంబరి శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తు ఇప్పుడు సంక్లిష్టంగా మారిందని, ఇది తమకు నిజంగా సవాల్ వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. శ్వేతాంబరి ఈ కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కేసు విచారణ సాగుతున్న తీరును వివరించారు. కథువా కేసు దర్యాప్తు చేయడం ప్రకటనలు చేసినంత సులువు కాదని ఆమె వ్యాఖ్యానించారు. కథువా దారుణంలో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఆధారాల సేకరణ చాలా కష్టతరంగా ఉందని ఆమె చెప్పారు. నిందితులను విచారిస్తున్నప్పటికీ..సంబంధిత ఆధారాల సేకరణ సాధ్యం కావడం లేదన్నారు.
ఈ ఘటన అత్యంత పాశవికమైనదని ప్రతి ఒక్కరికీ తెలుసని, కానీ కావాల్సింది ఆధారాలని, వాటిని సేకరించడంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బాధితురాలి కుటుంబం తరపున వాదిస్తున్న అడ్వొకేట్ దీపికా సింగ్ రజావత్ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఈ కేసులో నిందితుల తరపున వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ అంకుర్ శర్మ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యానికి తాను చలించిపోయానని, తర్వాత కోలుకుని దర్యాప్తును వేగవంతం చేశానని తెలిపారు. మన న్యాయవ్యవస్థ చాలా శక్తిమంతమైనదని, దానిపై అనుమానాలు అక్కర్లేదని స్పష్టంచేశారు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలపై తాను స్పందించనని, దేశ ప్రజలే బదులిస్తారని శ్వేతాంబరి శర్మ వ్యాఖ్యానించారు. డిఫెన్స్ లాయర్ అంకుర్ శర్మ శ్వేతాంబరిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మేధాశక్తిపై తనకు అనుమానాలున్నయాని,బృందంలో ఉన్న మిగతా సభ్యుల ప్రభావంతోనే ఆమె దర్యాప్తుచేస్తున్నారని విమర్శించారు.