సింగరేణిలో మరో ప్రమాదం

సింగరేణిలో మరో ప్రమాదం

సింగరేణిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.. గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. రామ‌గుండం ప‌రిధిలోని సింగ‌రేణి ఆర్జీ-3లోని ఓసీపీ-1లో డంప‌ర్‌ను మ‌రో డంప‌ర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. ఆప‌రేట‌ర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన స‌మాచారం అందుకున్న సింగ‌రేణి అధికారులు.. అక్కడికి వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించారు.

గోదావరిఖని గంగానగర్‌లోని మిలీనియం క్వాటర్‌లో నివాసముండే శ్రీనివాసరావు రోజులాగే విధుల్లోకి వెళ్ళాడు. రాత్రి షిఫ్టుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తుండ‌గా, క్వారీ ఏరియాలో డంప‌ర్ రివ‌ర్స్ తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న మరో డంప‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఆప‌రేట‌ర్ శ్రీ‌నివాస్‌రావు మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 18న మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలోనూ ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. డంపర్ వాహనం ప్రమాదవశాత్తూ బొలెరోపైకి ఎక్కడంతో పాషా, సాగర్ అనే ఇద్దరు ఉద్యోగులు, వెంకన్న అనే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది.