చరిత్ర సృష్టించేందుకు వికెట్‌ దూరం

చరిత్ర సృష్టించేందుకు వికెట్‌ దూరం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌, టీ20 స్పెషలిస్ట్‌ బౌలర్‌ డ్వేన్‌ బ్రావో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో చరిత్ర సృష్టించేందుకు వికెట్‌ దూరంలో ఉన్నాడు. ఇవాళ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో బ్రావో మరో వికెట్ తీస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం బ్రావో 170 వికెట్లతో మలింగతో సమానంగా ఐపీఎల్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌ టాప్‌ 6 వికెట్‌ టేకర్స్‌ జాబితాలో మలింగ, బ్రావోల తరువాత అమిత్‌ మిశ్రా , పియుష్‌ చావ్లా , హర్భజన్‌ సింగ్‌ , రవిచంద్రన్ అశ్విన్  ఉన్నారు.

ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా నేతృత్వంలో సీఎస్‌కే ఇవాళ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. చెన్నై.. కాన్వే స్థానంలో మొయిన్‌ అలీని ఆడించే ఛాన్స్‌ ఉండగా, లక్నో.. మొహ్సిన్‌ ఖాన్‌ బదులు కృష్ణప్ప గౌతమ్‌, షాబజ్‌ నదీమ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికీ వెటరన్‌ ఆటగాళ్లు బ్రావో , ధోని రాణించడం ఆ జట్టుకు శుభపరిణామమనే చెప్పాలి.