అమెరికాలోని అలస్కా దక్షిణతీరంలో సంభవించిన శక్తివంతమైన తీవ్ర భూకంపం తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీన్ని ముందు సునామీగా భావించిన జనం భయంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు పరుగులు పెట్టారు. అతి తక్కువ జనాభా కలిగిన అలస్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం పెర్రివిల్లేకు ఆగ్నేయ దిశలో తీరం నుంచి సముద్రంలోకి 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ళ లోతులో ఈ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 12 నిముషాలకు ఈ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేల్‌ఫై ఇంత భారీస్థాయిలో భూకంప తీవ్రత నమోదైనప్పటికీ, భూమి పెద్దగా కంపించినట్టు స్థానిక ప్రజలకు అనిపించలేదని అలస్కా రాష్ట్ర భూకంప పరిశోధకులు మైకేల్ వెస్ట్ చెప్పారు. ఇదిలా ఉండగా, అలస్కాకి 160 కిలోమీటర్ల పరిధిలోని చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు భూమి తీవ్రంగా కంపించినట్లు భావించారని వెస్ట్ తెలిపారు. ఇంకా 805 కిలోమీటర్ల దూరంగా ఉన్నవాళ్ళు సైతం భూమి స్వల్పంగా కంపించిన విషయాన్ని గ్రహించారని వెస్ట్ చెప్పారు. ఎటువంటి నష్టం వాటిల్లినట్లు వార్తలు రాలేదని కోడియాక్ పోలీసు అధికారులు చెప్పారు.