కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇదే !

EC-Declares-AP-Assembly-Ele

2019 సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 16వ లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. దీంతో ఆ లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సీఈసీ సునీల్ అరోరా షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రేదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సునీల్ అరోరా చెప్పారు. ఈ ఏడాది 10లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని సునీల్ అరోరా చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఈసారి అభ్యర్థులు తమ పాన్ నెంబర్‌ను కూడా అఫిడవిట్‌లో అందించాలని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఓటు వేస్తున్నామో ఓటర్లు స్పష్టంగా తెలుసుకునేందుకు ఈసారి ఈవీఎంపై అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 11 నుంచి మొదలు పెట్టి మే 19 వరకు ఏడు దశల్లోఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

మొదటి విడత ఎన్నికల తేదీ – 11 ఏప్రిల్ 2019
రెండో విడత ఎన్నికల తేదీ – 18 ఏప్రిల్ 2019
మూడో విడత ఎన్నికల తేదీ – 23 ఏప్రిల్ 2019
నాలుగో విడత ఎన్నికల తేదీ -29 ఏప్రిల్ 2019
ఐదో విడత ఎన్నికల తేదీ – 6 మే 2019
ఆరో విడత ఎన్నికల తేదీ – 12 మే 2019
ఏడో విడత ఎన్నికల తేదీ – 19 మే 2019

ఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలు…

మొదటి విడత 20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాలు
రెండో విడత 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాలు
మూడో విడత 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాలు
నాలుగో విడత 9 రాష్ట్రాల్లో 71 నియోజకవర్గాలు
ఐదో విడత 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలు
ఆరో విడత 7 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు
ఏడో విడత 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు