లారీల సమ్మె ఎఫెక్ట్ : ఇక నో పెట్రోల్, డీజిల్

Effect of Lorries Strike

లారీ ఓనర్ల సమ్మె ఈరోజుతో ఏడో రోజుకు చేరుకుంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ దేశవ్యాప్తంగా లారీ ఓనర్లు సమ్మెకు దిగడంతో ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయాయి. వారం రోజులుగా లారీల బంద్‌ సామాన్యులపై ప్రభావం చూపుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో మరింత ఉధృతంగా పోరాటం చేసేందుకు దేశవ్యాప్తంగా లారీ ఓనర్స్ సిద్ధమవుతున్నారు. ఇది అదునుగా చేసుకుని వ్యాపారస్తులు ధరలను ఎక్కడికక్కడ పెంచేస్తున్నారు. ప్రధానంగా ఉల్లి దిగుమతులు నిలిచిపోవడంతో ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరో రెండు రోజులు లారీలు కదలకపోతే నిత్యావసరాలు, కూరగాయల ధరలు మరింత పెరగడం ఖాయమని వ్యాపారవర్గాలు అంటున్నాయి.

పెట్రో ట్యాంకర్ల యజమానులు కూడా సమ్మెలో చేరడంతో సామాన్యులకు ఇటు నిత్యావసరాలు, అటు పెట్రోల్, డీజిల్ కష్టాలు తీవ్రమయ్యాయి. అయితే ఈరోజు నుండి వివిధ చమురు కంపెనీల నుంచి పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడంతో పెట్రోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్లు ఒక్కరోజు సమ్మె చేస్తేనే చాలా పెట్రోల్‌ బంకులకు సరఫరా నిలిచిపోయింది. దాంతో బంకుల నిర్వాహకులు ట్యాంకర్ల యజమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా జంట నగరాల్లో చాలా బంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇదే విధంగా ఇంకో రెండు మూడు రోజులు గడిస్తే జనజీవితం అస్తవ్యస్తం కానుంది.