కరోనా వైరస్ కారణంగా అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వైరం హత్యకు దారితీసింది. తాజాగా మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ శివారు కందివాలిలో కోవిద్ -19 లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టినందుకు గాను తన తమ్ముడిని చంపేశాడు అన్న. దీంతో 28 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి లాక్ డౌన్ పై పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కారణంగా రాజేష్ లక్ష్మి ఠాకూర్ అనే వ్యక్తి తన తమ్ముడైన దుర్గేష్ ను చంపాడని సమతా నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలియజేశారు.
అయితే పూణేలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న నిందితుడు కరోనా వైరస్ భయంతో ఇంటికి తిరిగి వచ్చాడని అధికారి తెలియజేశారు. దుర్గేష్ తన విహార యాత్ర తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో నిందితుడు అతని భార్య, దుర్గేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశాన్ని తట్టుకోలేక నిందితుడు తన తమ్ముడిపై పదునైన వస్తువుతో దాడి చేశాడని అధికారి వెల్లడించారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడికి అక్కడే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.