దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితో కోవిడ్ బారిన పడుతున్న వారిలో 18-44 ఏళ్ల వారే అధికంగా ఉన్నట్లు డేటా వెల్లడిస్తుంది. మొత్తం కరోనా కేసుల్లో వీరి సంఖ్య 54శాతంగా ఉంది. ఇక మరణాలను పరిశీలిస్తే.. వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో వృద్ధులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 51శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు డాటా తెలుపుతోంది.
ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా ప్రజలను కోరుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం.. సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను ఆచరిస్తేనే మహమ్మారి బారిన పడకుండా ఉండగలం అంటుంది.
అంతేకాక ‘దేశ ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించడం వంటి వాటిని కఠినంగా ఆచరిస్తే.. ఈ ఏడాది డిసెంబరు నాటికి 2 లక్షల మరణాలు సంభవించకుండా ఆపవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కనుక ప్రజలంతా ఈ నియమాలను తప్పక పాటించాలని’ కోరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.