తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 218 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈనెల 3వ తేదీ వరకు ఎంసీసీ ఉల్లంఘన కింద నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలను ఆయన వెల్లడించారు. మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీ సమయంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని కేసులు పెట్టినట్లు చెప్పారు.
పలువురు అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం సహా కొన్ని చోట్ల జరిగిన గొడవలు ఘర్షణల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వికాస్ రాజ్ తెలిపారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా కొన్ని కేసులు నమోదు చేస్తే… అధికారులు సుమోటోగా గుర్తించి నమోదు చేసినవి కొన్ని ఉన్నాయని చెప్పారు. రాజకీయ పార్టీల సంబంధంఉన్న కేసులతో పాటు కొంత మంది స్వతంత్రులు, ఇతర వ్యక్తులకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులు ఉన్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో అధికార BRS నుంచి ఇద్దరు అభ్యర్థులపై కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.