తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ రైతులకు అమిత్ షా హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. బోయ, మాదాసి, కురువ, వాల్మీకి కులాలకు న్యాయం చేస్తామన్నారు. అలాగే శ్రీశైలం నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, బీజేపీ గెలిస్తే.. నిర్వాసితులకు అందరికీ పరిహారం, భూమి అందజేస్తామని కీలక హామీ ఇచ్చారు. అలాగే గుండు మల్ల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగా మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని అమిత్ షా మామిడి రైతులకు తెలిపారు.
బీజేపీ తెలంగాణలో గెలిస్తే బీసీ సీఎం అవుతాడని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2.50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని.. కేసీఆర్ కు మాత్రం తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడమే ముఖ్యమని అమిత్ షా విమర్శించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడింది. కేసీఆర్ తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాడని అమిత్ షా అన్నారు. అలాగే కొల్లాపూర్ బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.