ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పొంగులేటి ఇంటిపై ఐటీ ,ఈడీ దాడులను నిరసిస్తూ అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అక్కడితో ఆగకుండా శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నాలుగు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, ఖమ్మంలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మంలో 5, హైదరాబాద్లో 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. పొంగులేటి బంధువులు, కీలక ఉద్యోగుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ, ఐటీ అధికారులు. ఇక అటు ఇవాళ పాలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు పొంగులేటి. ఇలాంటి తరుణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల పై ఐటీ దాడులు జరుగుతున్న అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. నిన్న తుమ్మల, నేడు పొంగులేటి, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆగ్రహించారు.