తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎవ్వరికీ వారు పోటా పోటీగా తమదైన స్టైల్ లో ఎన్నికల్లో గెలవాలనే ధీమాతో ప్రచారాన్నిముమ్మరం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, మల్లికార్జున ఖర్గే, డీ.కే.శివకుమార్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తుండగా, బీజేపీ తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ సా, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వీలు కుదిరినప్పుడల్లా రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూకి హాజరు కావడం లేదు. త్వరలోనే టీవీ9కు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. చాలా రోజుల తర్వాత ఓ ప్రైవేట్ ఛానల్‌కు సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. టీవీ9తో కేసీఆర్ మాట్లాడబోతున్నారని సమచారం. ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తారనేది తెలియాల్సి ఉంది. ఇవాళ లేదా రేపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.