తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రోజున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 14 టేబుళ్ల ద్వారా 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, 500లకు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారని వికాస్ రాజ్ తెలిపారు. ఈ దఫా 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉందని.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారని వెల్లడించారు. పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని.. పరిశీలకుల ఆమోదం తరవాతే ఫలితాలను వెల్లడిస్తారని చెప్పారు.