Election Updates: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Election Updates: IT searches continue at Ponguleti Srinivasa Reddy's houses for the second day
Election Updates: IT searches continue at Ponguleti Srinivasa Reddy's houses for the second day

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- ఛైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 17లో ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లోని పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యులు ఐటీ దాడుల నేపథ్యంలో ఖమ్మం నుంచి హైదరాబాద్​ వచ్చారు. వారి నుంచి ఐటీ అధికారులు పలు వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు ఐటీ అధికారులు గురువారం రోజున పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం..ఏకకాలంలో ఆయన నివాసాలు, రాఘవ కన్స్‌స్ట్రక్షన్స్ సంస్థల కార్యాలయాలపై మూకుమ్మడి సోదాలు చేపట్టి పొంగులేటి కుటంబసభ్యులు, సిబ్బంది అందరి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అన్ని గదుల్లో తనిఖీలు చేపట్టి ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, పలు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. రాఘవా కన్స్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లపైనా పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి తనపై కుట్ర పన్నాయని.. ఉద్దేశపూర్వకంగా తనపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని పొంగులేటి ఆరోపించారు. బీజేపీలో చేరలేదన్న కోపంతో ఆ పార్టీ.. బీఆర్ఎస్ నుంచి విడిపోయానన్న కోపంతో గులాబీ దళం తనపై ఈ కుట్ర పన్నాయని విమర్శించారు.