తెలంగాణలో తొలిసారిగా జనసేన తన బలాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ముగిసింది. జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తుందని గతంలోనే ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ నేతలు పవన్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోఅమిత్ షాతో భేటీ అనంతరం సీట్ల ఖరారుపై చర్చలు జరిపారు. జనసేన తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని కోరింది.
కానీ, చివరకు 9 సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ నుంచి సెటిలర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలనేది బీజేపీ వ్యూహం. బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎల్బీనగర్, కూకట్ పల్లి, సెరిలింగం పల్లి వంటి స్థానాలను కేటాయించాలని జనసేన భావిస్తోంది. మిగిలిన సీట్లను ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకునే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంది. ఇంకా 29 రోజులు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మిగిలి ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి.
ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతుంటే మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్‌లో ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వేగం పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఈ రాత్రికి తుది జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను ఖరారు చేయనుంది. అలాగే జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.