Election Updates:తెలంగాణలో తొలిరోజే 100 నామినేషన్లు.. ఖాతా తెరవని BRS

Election Updates: 100 nominations on the first day in Telangana.. BRS account not opened
Election Updates: 100 nominations on the first day in Telangana.. BRS account not opened

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 119 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో మొదటి రోజున 100 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు మొదటిరోజు పలుచోట్ల నామినేషన్లు వేశారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. తొలిరోజు నామినేషన్లలో అధికంగా స్వతంత్ర అభ్యర్థులవే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులూ నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం రోజున ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్ జారీ చేయగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి 8 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ గోశామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారావు అబిడ్స్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాఖలు చేయగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున కొడంగల్‌లో ఆయన సోదరుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ 2.. ఖైరతాబాద్‌లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున జ్యోతి .. మలక్‌పేట్‌లో బీఎస్పీ అభ్యర్థి అలుగోల రమేశ్‌ నామినేషన్లు వేశారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కేఎస్.రత్నం తరఫున ఆయన కుమారుడు .. సంగారెడ్డిలో మంజీరా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంత మంది చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.