సీఎం కేసీఆర్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంత చేసుకున్నారని తెలిపారు.
మరోవైపు చంద్రమోహన్ మృతి బాధాకరమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా విభిన్న పాత్రలు అలవోకగా పోషించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.