Election Updates: కేసీఆర్​కు వ్యతిరేకంగా గజ్వేల్‌లో 70కి పైగా నామినేషన్లు

Election Updates: Over 70 nominations in Gajwel against KCR
Election Updates: Over 70 nominations in Gajwel against KCR

తెలంగాణలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్​కు వ్యతిరేకంగా గజ్వేల్​ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈటల నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక రేవంత్ ఇవాళ కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేస్తారు.

మరోవైపు కేసీఆర్​కు వ్యతిరేకంగా వీరిద్దరు మాత్రమే కాకుండా.. గజ్వేల్‌లో 70 పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి, రాజేంద్రనగర్ గ్రామాలకు చెందిన శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఈ నామినేషన్స్‌ దాఖలు చేశారు. 1983 లో శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన 460 ఏకరాల భూమి కొనుగోలు చేశామని.. ధరణి పోర్టల్‌ రావడం వల్ల ఆ భూమి వ్యవసాయ భూమిగా మార్చి.. డబుల్ రిజిస్ట్రేషన్ పేరిట కొందరు బడా బాబులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. తమ సమస్య కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడానికే నామినేషన్లు వేస్తున్నట్లు బాధితులు తెలిపారు.