తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి, డ్రగ్స్, నగదు, బంగారం, వెండి, మద్యం వంటివి పట్టుబడుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.453 కోట్లకు పైగా మద్యం, నగదు, ఆభరణాలు, ఇతరాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
అక్టోబర్ తొమ్మిది నుంచి 164కోట్ల 11లక్షల నగదు, గడచిన 24 గంటల్లో 7 కోట్ల 98లక్షల నగదు పట్టుబడినట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు 27కోట్ల 58 లక్షల విలువైన డ్రగ్స్, 52కోట్ల93 లక్షల విలువైన మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి 43కోట్ల 86 లక్షల రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 165కోట్ల 43 లక్షల విలువైన వెండి ఆభరణాలు, బంగారు పట్టుబడినట్లు చెప్పారు. ఆంక్షల నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని.. కేవలం సామాన్యుల వాహనాలే కాకుండా.. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇలా అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు వివరించారు.